Electrical and Electronics Engineering: B.tech(EEE)తో భవిష్యత్‌కు భరోసా.. 10 month ago
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్ధుల లక్ష్యం....ఇంజినీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్ కోర్సులలో మంచి కాలేజీలో చేర్పించాలని కోరుకుంటారు. B.tech. (EEE) బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్ధుల భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే మంచి భవిష్యత్ ఉంటుంది...? నాలుగేళ్ల తర్వాత జాబ్ మార్కెట్లో ఈ బ్రాంచ్ కి ఎలాంటి అవకాశాలుంటాయి? ప్రస్తుతం ఎలా ఉంది...? అలాగే కాలేజీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్ధులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో EEE బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్ధుల కోసం ప్రత్యేక కథనం.....
భవిష్యత్‌కు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో EEE ఒకటి!
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE). ఈ బ్రాంచ్ విద్యార్ధులు...ఇటు ఎలక్ట్రికల్ రంగం...అటు ఎలక్ట్రానిక్స్ రంగం... ఇలా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న బ్రాంచ్‌గా EEE ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంచనాల ప్రకారం దేశంలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లు, పథకాల కారణంగా రానున్న కాలంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) పూర్తి చేసిన అభ్యర్ధులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యూనికేషన్, కంప్యూటర్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, బయోమెడికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. ఇవే కాకుండా పవర్ ప్లాంట్‌లు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్లలో పవర్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో సైతం కొలువులను సాధించవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, ఛీఫ్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రిలయబిలిటీ ఇంజనీర్, డెవలప్‌మెంట్ ఇంజనీర్, సిస్టమ్ డిజైన్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ సహా వివిధ అనుబంధ విభాగాల్లో వీరిని నియమించుకుంటారు.
విద్యార్హత:
ఇంటర్ ఎంపీసీతో పాటు పాలిటెక్నిక్ చేసిన వాళ్లు కూడా అర్హులే. పాలిటెక్నిక్ చదివిన వారు లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ లేదా మేనేజ్‌మెంట్ సీటు ద్వారా కూడా B.tech.లో చేరవచ్చు . ఆల్ ఇండియాలో టాప్ ఇనిస్టిట్యూట్స్ అంటే ఐఐటీస్. మీకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చి నట్లయితే ఐఐటీలలో జాయిన్ అవ్చొచ్చు. స్టేట్ లెవల్ అయితే ఎమ్‌సెట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టేట్ లో ఉన్న కాలేజీలలో, యూనివర్సిటీలలో చేరవచ్చు. కొన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలు అయితే ఇంటర్నల్ గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో మంచి ర్యాంక్ వచ్చిన వారికి సీటు కల్పిస్తారు. ఉదాహరణకు KL EEE, VIT EEE, SRMJEEE, Vignan VSAT లాంటి విద్యాసంస్ధలు
అవకాశాలు:
ఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాల్లో వచ్చే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ మెమొరీ స్టోరేజీ డివైజ్‌లు, సీఎన్‌సీ మెషిన్ సర్క్యూట్లు, ఇండస్ట్రియల్ రోబోట్స్‌ను ఈఈఈ ఇంజనీర్లే రూపకల్పన చేస్తారు.
కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ డిజైన్ మైక్రో ప్రాసెసర్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, పవర్ జనరేషన్, విద్యుత్ యంత్రాలకు సంబంధించిన అనుబంధ విధులను కూడా వీరు నిర్వర్తిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, కంప్యూటర్ వంటి వాటి భాగాలను తయారు చేయడం, వాటిని డిజైన్ చేయడం వంటివి కూడా చేస్తారు.
విధులు:
విద్యుత్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) బ్రాంచ్ చక్కటి మార్గంగా చెప్పవచ్చు. భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో EEE ఒకటి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ వంటి వాటితోపాటు ఎలక్ట్రికల్ పరికరాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్ లాంటివి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ల ప్రధాన విధులు. భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే రంగాల్లో పవర్ రంగం ఒకటి. ఈఈఈ బ్రాంచ్‌ని ఎంపిక చేసుకోవాలనుకునే విద్యార్ధులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై మంచి పట్టుండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పై ఆసక్తి కలిగిన విద్యార్ధులు EEE లో చేరడం ద్వారా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణించవచ్చు.
ప్రభుత్వ & ప్రైవేట్ సంస్ధలు:
జెన్‌కో, ట్రాన్స్‌కో, పవర్ గ్రిడ్, NTPC, BHEL, NHPC, డీఎంఆర్‌సీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధలతో పాటు TATA, సామ్‌సంగ్, రిలయన్స్, సీమెన్స్, Crompton Greaves, Hitachi, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి ప్రైవేట్ కంపెనీల్లోనూ EEE అభ్యర్ధులు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా విద్యుత్ రంగంలో అమలవుతున్న పథకాలు, ప్రైవేటు రంగంలో ఏర్పాటవుతున్న పవర్ ప్రాజెక్ట్‌ల వల్ల రానున్న కాలంలో EEE ఇంజనీర్లు అవసరం ఉంటుందని అంచనా. మరోవైపు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే దిశగా సంస్ధలు అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్ తదితరాలకు సంబంధించి అసెంబ్లింగ్ యూనిట్ల సంఖ్య దేశంలో పెరుగుతోంది. గత మూడు, నాలుగేళ్లుగా ఎన్ఐటీ, ఐఐటీల్లో చేరే విద్యార్ధుల మూడో ప్రాథమ్యంగా ఈ బ్రాంచ్ నిలుస్తోంది.
బీటెక్‌లో చేరనున్న విద్యార్ధులు బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని బ్రాంచ్‌ల విద్యార్ధులకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బీటెక్‌లో చేరిన విద్యార్ధులు కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఎన్ఐటీలు, ఐఐటీల్లో అవకాశం వచ్చిన విద్యార్ధులు...బ్రాంచ్ విషయంలో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న కరిక్యులం ప్రకారం ఇంటర్‌డిసిప్లినరీ విధానంలో బోధన సాగుతోంది. దీంతో విద్యార్ధులు మేజర్‌తోపాటు మైనర్‌గా తమకు నచ్చిన బ్రాంచ్‌కు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం పొందే అవకాశం ఉంది.
ఇది చదవండి: ఎంతోమంది ఆసక్తి చూపుతున్న కోర్సు.. సివిల్ ఇంజినీరింగ్.!